కొన్ని సినిమాలు కొంతమందే చేయాలి. ఈ మాటేదో నెగిటివ్గా అంటున్నది కాదు. అలాంటి సినిమాలు వాళ్లకే నప్పుతాయి అని, అలాంటి జోనర్లో సినిమాలు వాళ్లే చేయాలి అని. అయితే ఇలాంటి నియమాలేవీ లేకుండా, ఎలాంటి సినిమానైనా తనదైన శైలిలో మెప్పించగల నటులు కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో ధనుష్ (Dhanush) ఒకరు. సినిమా కోసం ఎంతైనా కష్టపడి, ఎంతైనా మారే జోనర్ నటుడు ఆయన. అలాంటి వ్యక్తి దర్శకుడిగా మారి తన సినిమా తానే చేస్తే.. అదే ‘రాయన్’ (Raayan).
‘పా పాండి’ అనే సినిమాతో ఎప్పుడో ఏడేళ్ల క్రితమే దర్శకుడిగా మారిన ధనుష్.. ఆ తర్వాత మళ్లీ అటువైపు వెళ్లేలేదు. అలాంటి ఆయన తన 50వ సినిమాను తానే డైరెక్ట్ చేద్దాం అనుకున్నాడు. ఓ యాక్షన్ సినిమాను పూర్తి చేశాడు కూడా. అదే రాయన్. జూలై 26న ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ట్రైలర్ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. ఆ ట్రైలర్ చూశాక ‘ధనుష్ సినిమా అంటే ఇలానే ఉంటుంది’, ‘వామ్మో ఆ రక్తపాతమేంటి?’ అని కామెంట్లు చేస్తున్నారు.







